రత్నగిరిపై రూ.1.60 కోట్లతో అభివృద్ది పనులు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.1.60 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టనున్నారు. రూ.40 లక్షలతో రెండో ఘాట్ రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మాణం, రూ.1.20 కోట్లతో న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలు, ప్రకాష్ సదన్ సత్రాల గదుల మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్న నేపథ్యంలో దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ తదితరులు ఆయా సత్రాలను మంగళవారం సందర్శించి, పనుల ఆవశ్యకతను పరిశీలించారు. రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. మిగిలిన మూడింటికీ టెండర్లు పిలవాల్సి ఉంది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు రాంబాబు, గుర్రాజు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాల్లో తనిఖీలు
కాకినాడ క్రైం: బాణసంచా అక్రమ తరలింపు నేపథ్యంలో సోమవారం కాకినాడలో చోటు చేసుకున్న పేలుడుతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరంలోని పలు కొరియర్, ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పార్శిళ్లను బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. సంస్థ యాజమాన్యాలకు బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, రసాయనాలు, మాదక ద్రవ్యాలు బుక్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అనుమానాస్పద పార్సిళ్లను గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో కాకినాడ వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలు జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు 21,502, మంది హాజరు కాగా, 732 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,673 మంది హాజరవగా 135 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి శిక్షణ
కాకినాడ రూరల్: రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కార్యాలయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి రెండు వారాల శిక్షణను కమాండెంట్ ఎం.నాగేంద్రరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎస్‌డీఆర్‌ఎఫ్ పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ముందుండి రక్షించే లక్ష్యంతో తొలిసారిగా మూడో బెటాలియన్‌లోనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించారని తెలిపారు. కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ, తిత్లీ తుపాను, దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా, ఇటీవల విజయవాడ సింధు నగర్ అర్బన్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఏపీఎస్పీ మూడో బెటాలియన్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మంచి ప్రతిభ చూపారన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డులు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది తాము ఉపయోగించే వివిధ పరికరాలను కమాండెంట్‌కు చూపించి, వాటి పనితీరును వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు మోహన్‌రావు, బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాదగయకు రూ.11.75
లక్షల ఆదాయం
పిఠాపురం: పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం హుండీని మంగళవారం తెరచి ఆదాయం లెక్కించారు. సీఎస్‌ఓ సీహెచ్ రామ్మోహనరావు, ఇన్‌స్పెక్టర్లు వడ్డి ఫణీంద్రకుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ కె.జగన్‌మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 17 రోజులకు గాను హుండీల ద్వారా రూ.11,74,660 ఆదాయం లభించిందని ఈఓ తెలిపారు.
రత్నగిరిపై రూ.1.60 కోట్లతో అభివృద్ది పనులు
రత్నగిరిపై రూ.1.60 కోట్లతో అభివృద్ది పనులు
Comments
Please login to add a commentAdd a comment