కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు
కాకినాడ క్రైం: కాకినాడ పరిధిలో అగ్నిప్రమాదాలతో పాటు నీటి వనరులు ఎక్కువగా ఉండటంతో జల ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర అగ్నిమాపక శాఖ నార్త్ రీజియన్ అదనపు డైరెక్టర్ జి.శ్రీనివాసులు తెలిపారు. వీటి నిర్వహణకు గాను కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు మంజూరు చేస్తామని చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన స్థానిక వివేకానంద పార్క్ ఎదురుగా ఉన్న జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంతో పాటు, సాలిపేట ఫైర్ స్టేషన్‌ను మంగళవారం సందర్శించి, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది కార్యకలాపాలు, పరికరాలు, స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సహాయ ఫైర్ అధికారి వి.సుబ్బారావును అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, మినీ రెస్క్యూ టెండర్లలో ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు అధికమని, రసాయనాల వల్ల అనుకోని దుర్ఘటనలు జరిగితే ప్రాణ నష్టాన్ని ఊహించలేమని అన్నారు. అటువంటి రసాయన ప్రమాదాల నివారణకు గాను త్వరలో కాకినాడకు హజ్మత్ వాహనాన్ని కేటాయించనున్నామని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తక్షణమే బయట పడేందుకు అక్కడి భద్రతా సిబ్బందికి ప్రత్యేక రెస్క్యూ శిక్షణ ఇస్తామని శ్రీనివాసులు తెలిపారు. దీనికోసం స్థానిక జగన్నాథపురంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ప్రత్యేక శిక్షణా విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దట్టమైన పొగలో సిబ్బంది ఎటువంటి ప్రమాదానికీ గురి కాకుండా త్వరలో జిల్లాకు బ్రీతింగ్ ఆపరేటర్లు ఇస్తున్నామని తెలిపారు. సాలిపేట అగ్నిమాపక కార్యాలయానికి త్వరలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. దీనికి అన్ని అనుమతులూ పూర్తయ్యాయని వెల్లడించారు. జగన్నాథపురం ఫైర్ స్టేషన్లో నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు మంగళవారం టెండర్లు పిలిచామని శ్రీనివాసులు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి పీవీఎస్ రాజేష్, ఏడీఎఫ్‌వో సుబ్బారావు కూడా పాల్గొన్నారు.
ఫ హజ్మత్ వాహనం కూడా
త్వరలో మంజూరు
ఫ అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment