వేసవిలో విద్యుత్ సమస్యలపై దృష్టి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్ల ఓవర్ లోడ్‌ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్‌మెన్ దివస్ కార్యక్రమంలో లైన్‌మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment