రూ.166 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబు కావాలంటే బాబు రావాలి.. జనవరి 1నే జాబ్ క్యాలెండర్.. పరిశ్రమల ఏర్పాటు.. వర్క్ ఫ్రం హోం కోసం హైటెక్ టవర్లు.. 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి.. అంటూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఊరూవాడా ఊదరగొట్టేశారు. తీరా అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాల్లో కలిపేసి, నమ్మిన జనాన్ని నిట్టనిలువునా నట్టేట ముంచేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లో సైతం అరకొర నిధులతో మరోసారి దగా చేశారు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి వంచన చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసే లేదు. తొమ్మిది నెలల పాలనలో కొత్త ఉద్యోగాలివ్వకపోగా.. ఉన్నవి ఊడబీకారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై యువత, విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉద్యమించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి మోసపోయిన యువత పక్షాన పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం కాకినాడలో యువత పోరు పేరిట పోరాటానికి సిద్ధమయ్యారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా తరలి వెళ్లి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ముందుకు కదులుతున్నారు.
జిల్లావ్యాప్తంగా పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు 170 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేది. దీనికితోడు వసతి దీవెన నిధులు కూడా ఇచ్చేది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో చివరిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిబంధనలు అడ్డం పడ్డాయి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరానికి మూడు విడతలు, 2024–25లో రెండు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉండగా.. ఒక విడత మాత్రమే ఇటీవల విడుదల చేశారు. మొత్తం మూడు విడతలకు సంబంధించి రూ.90 కోట్ల మేర కూటమి సర్కార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టేసింది. విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు కింద మొక్కుబడిగా రూ.2 కోట్లు విడుదల చేసి, రూ.76 కోట్లు బకాయిలు పెట్టేసింది. మొత్తం అన్నీ కలిపి రూ.166 కోట్ల మేర విద్యార్థులకు బకాయి పెట్టింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి.
తల్లికి వందనం పేరిట కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కాక ‘తల్లికి మాత్రమే రూ.15 వేలు’ అని మెలిక పెడుతూ జీఓ ఇచ్చారు. దీనిపై పెద్ద ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవ్వడంతో తూచ్ అంటూ మాట మార్చారు. కానీ, నెలలు గడుస్తున్నా ఇంతవరకూ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ చేయలేదు. జిల్లాలో యీ పథకానికి అర్హులైన విద్యార్థులు 1,86,708 మంది ఉన్నారు. వీరికి తల్లికి వందనం కింద రూ.250.30 కోట్లు చెల్లించాలి. కానీ, పైసా కూడా చంద్రబాబు విదల్చలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అదే, గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.13 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మిగిలిన రూ.2 వేలలో రూ.వెయ్యి డిస్ట్రిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్‌కు, మరో రూ.వెయ్యి డిస్ట్రిక్ట్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్‌కు జమ చేశారు.
తల్లికి వంచన
యువత పోరుకు సర్వం సిద్ధం
కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వెనుక ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి ఆవిర్భావ దినోత్సవం అనంతరం యువత పోరు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చే విద్యార్థులు, యువతకు మద్దతుగా పార్టీ నేతలు, శ్రేణులు ముందు నిలిచి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తాం. విద్యార్థులు, యువతకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేస్తాం.
– దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment