బ్యాంకు రుణాల పంపిణీ ముమ్మరం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల పంపిణీ మరింత ముమ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కూడిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.11,460 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, రూ.4,102 కోట్లు పంపిణీ చేశారన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.4,184 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, లక్ష్యానికి మించి రూ.5,872 కోట్లు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 15,599 మంది కౌలు రైతులకు వ్యక్తిగతంగా రూ.55.48 కోట్లు, 20,495 మంది కౌలు రైతులకు ఆర్‌ఎంజీ, జీఎల్జీ గ్రూపుల ద్వారా మరో రూ.79.48 కోట్ల మేర పంట రుణాలు మంజూరు చేశారన్నారు. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 3,704 మందికి రూ.4,568 కోట్ల రుణాలు అందించాలనేది లక్ష్యంగా నిర్దేశించారన్నారు. దీనిని సమన్వయంతో పూర్తి చేయాలని జేసీ కోరారు. ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 57 జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు 50 శాతం బ్యాంకు రుణాలుగా రూ.228 కోట్లు అందించాలన్నారు. డీఆర్‌డీఏ ద్వారా ఇప్పటి వరకూ 14,315 డ్వాక్రా గ్రూపులకు రూ.1,075 కోట్లు, మెప్మా ద్వారా 4,312 డ్వాక్రా గ్రూపులకు రూ.508 కోట్ల మేర బ్యాంకు రుణాల లింకేజీ అందించారని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 3,801 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.538 కోట్ల బ్యాంకు రుణంతో ఇప్పటి వరకూ 140 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకూ రుణాలు అందించాలని బ్యాంకర్లను జేసీ రాహుల్ మీనా కోరారు. కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ కాకి సాయి మనోహర్, ఎల్‌డీఎం సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్, రిజర్వు బ్యాంకు ఎల్‌డీఓ పూర్ణిమ, నాబార్డు ఏజీఎం వై.సోమునాయుడు, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment