లక్ష్యానికి మించి ‘ఉపాధి’
కరప: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని గడువుకు ముందే అధిగమించామని డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఉపాధి హామీ పథకం రికార్డులను తనిఖీ చేసి, కార్యాలయ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నెలాఖరుకు 69 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఫిబ్రవరి నెలాఖరుకే లక్ష్యాన్ని పూర్తి చేశామని చెప్పారు. రెండు లక్షల పని దినాలు పొడిగించగా ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశామన్నారు. మరో 10 లక్షల పని దినాలు మంజూరయ్యాయని, వీటిని ఈ నెలాఖరు పూర్తి చేస్తామని చెప్పారు. రోజుకు 50 వేల మందితో పని చేయించాల్సి ఉండగా, 30 వేల మందే పని చేస్తున్నారని, రోజువారీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, 10.30 గంటలకే ముగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించామన్నారు. వేతనదారులు స్వయంగా 2 లీటర్ల తాగునీరు తెచ్చుకోవాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పని చేసేచోట ఎండ తగలకుండా పందిళ్లు లేదా షామియానాలు వేయించాలని చెప్పారు. గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మినీ గోకులాల నిర్మాణాలు చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో కంపోస్ట్ పిట్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో 2,115 నీటిగుంతలు తవ్వించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకూ 600 గుంతల పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు 750 మినీ గోకులాలు మంజూరవగా ఇంతవరకూ 700 పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,330 సోక్‌పిట్స్ తవ్వించేందుకు ప్రతిపాదించామని వెంకటలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.అనుపమ, ఏపీఓ జీవీ రమణకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ వీవీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment