
పెట్రో ధరలపై సీపీఎం ధర్నా
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ సుంకాల పేరుతో గ్యాస్‌పై నేరుగా రూ.50 పెంచారన్నారు. దీనివల్ల నిత్యావసర సరకుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. ఒకపక్క దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టి మరిన్ని ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చేదిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారని ఎవరికి అచ్చేదిన్ అని ఆనాడే సీపీఎం ప్రశ్నించిందన్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచడమే బీజేపీ, మోదీ విధానాలని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మనదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం విడ్డూరంగా ఉందని ఆందోళనకారులు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడాలన్నారు. గాడిమొగ గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు రూ.100కే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు కె.సత్తిరాజు, పలివెల వీరబాబు, మలక వెంకటరమణ, జి.భూలక్ష్మి, టి.రాణి, ఆర్.తలుపులమ్మ, పోలితల్లి, కె.సత్తిబాబు, వి.కుమార్‌స్వామి, టి.వీరబాబు, రాజు, నరేంద్ర, శివ పాల్గొన్నారు.