
మరో మైలురాయిగా టైగర్ ట్రయంఫ్
● వెనుదిరిన సైన్యం, నేవీ అధికారులు
● నేటి నుంచి బీచ్ రోడ్డులో
యథాతథంగా రాకపోకలు
కాకినాడ రూరల్: ఇండో – అమెరికన్ సైనిక దళాల మధ్య పరస్పరం నైపుణ్యం పంచుకునే లక్ష్యంతో నిర్వహించిన టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ఇరు దేశాల రక్షణ అంశంలో మరో మైలురాయిగా నిలిచాయి. పరస్పర సహకారంతో పాటు, విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో నాలుగో ఎడిషన్ యాంఫిబియస్ ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు నిర్వహించారు. విశాఖ తీరంలో ఈ నెల 1న భారత్,– అమెరికా దేశాల నేవీ, ఎయిర్‌ఫోర్స్, సైనిక దళాల సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కాకినాడ తీరంలో ఈ నెల 8 నుంచి క్లిష్టమైన సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో ఇరు దేశాల నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు పాల్గొన్నాయి. సముద్ర కార్యకలాపాలు, విమానాల క్రాస్– డెస్ ల్యాండింగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ (ఆర్‌ఏఎంటీ), కంబైన్డ్ కో ఆర్డినేషన్ సెంటర్ ద్వారా విపత్తులు నిర్వహణపై ఎక్సర్‌సైజ్‌లో యూఎస్ దళాలు పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మక విన్యాసాలు ముగియడంతో ఇరు దేశాల అధికారులు శనివారం తిరుగుపయనమయ్యారు. నేవీ అధికారులు, సిబ్బంది తమతో తీసుకువచ్చిన వాహనాలను, ఇతర సామగ్రిని విశాఖకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయానికి బీచ్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి బీచ్ రోడ్డులో ఉప్పాడకు రాకపోకలను పునరుద్ధరించనున్నారు. అలాగే సూర్యారావుపేట, పోలవరం, పరకాల్వ, నేమాం గ్రామాల ప్రజలు బీచ్‌కు వచ్చేందుకు అనుమతించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం నుంచి ఎత్తివేస్తున్నామని రూరల్ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు.

మరో మైలురాయిగా టైగర్ ట్రయంఫ్