
నేటి నుంచి ఏపీఎస్పీ స్పోర్ట్స్ మీట్
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ) రేంజ్–1 పరిధిలోని బెటాలియన్ల సిబ్బంది స్పోర్ట్స్, గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభ కానున్నాయి. ఈ పోటీలకు కాకినాడ రమణయ్యపేటలోని మూడో బెటాలియన్ ఆతిథ్యం ఇస్తోంది. బెటాలియన్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్, గేమ్ మీట్‌లో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి, నెల్లూరు బెటాలియన్లకు చెందిన క్రీడా బృందాలు హాజరు కానున్నాయి. ఈ పోటీలను కమాండెంట్ నాగేంద్రరావు ప్రారంభించనున్నారు. ముగింపు రోజు కార్యక్రమంలో బెటాలియన్స్ ఐజీ పాల్గొంటారు.
మహోన్నతుడు అంబేడ్కర్
కాకినాడ సిటీ: దేశ ప్రజలందరికీ మహోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు, రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇంద్రపాలెం కూడలి వద్ద ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ తదితరులు సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య రచించిన శ్రీఅంబేద్కర్‌పై అపోహల సృష్టి, వాటికి సమాధానాలుశ్రీ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. స్థానిక జగన్నాథపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతూ ఇంటర్మీడియెట్‌లో 956 మార్కులు సాధించిన కె.రాజేశ్వరిని, 917 మార్కులు సాధించిన సీహెచ్ దేవిని సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువు మాత్రమే ఎలాంటి సమస్యల నుంచైనా గట్టెక్కిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాలని అన్నారు. కాకినాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ జేడీ జి.శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి పాల్గొన్నారు.
అంబేడ్కర్ అందరివాడు
తుని: అంబేడ్కర్ అందరివాడని, ఆయన అడుగు జాడల్లో యువత పయనించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా తుని సీఎంఆర్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దళిత నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించిన మహానీయుడు అంబేడ్కర్ అని రాజా కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు, బొంగు ఉమారావు, రేలంగి రమణాగౌడ్, షేక్ ఖ్వాజా, నక్కా జాన్ ఆనంద్, మీలా బుజ్జి, తుని తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
హోరాహోరీగా చదరంగం పోటీలు
అమలాపురం రూరల్: కోనసీమ డిస్ట్రిక్, ఆంధ్రా చెస్ అసోసియేసషన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం మండలం కామనగరువులో ఢిల్లీ పబ్లిక్ స్కూలో కోనసీమ డిస్ట్రిక్ట్ ఓపెన్ చదరంగ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు తరలివచ్చారు. బి.నానిబాబు ప్రఽథమ స్థానం సాధించి రూ.4,000 నగదు బహుమతి, డి. సాత్విక్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని రూ.3,000 గెలుచుకున్నాడు. టి.సాయి వెంకటేష్ తృతీయ స్థానం సాధించి రూ.2000 గెలుపొందాడు. ఏడు స్థానాల్లో విజేతలకు నగదు బహుమతులను డీపీఎస్ స్కూల్ చైర్మన్ నంద్యాల నాయుడు, డైరెక్టర్ నంద్యాల మను విహార్ సోమవారం అందజేశారు. ఈ పోటీల్లో అండర్ 9, 11, 13, 15 విభాగాల్లో మొదటి ఐదుస్థానాలకు సీ్త్ర, పురుషులకు విడివిడిగా నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. విజేతలను చెస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తాడి వెంకట సురేష్‌కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ దేవి దీక్షిత్, చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, టోర్నమెంట్ డైరెక్ట్ శ్రీనుబాబు అభినందించారు.

నేటి నుంచి ఏపీఎస్పీ స్పోర్ట్స్ మీట్