
సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి
● స్వామివారిని దర్శించిన 40 వేల మంది
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది స్వీకరించారు.
ఘనంగా రథ సేవ
ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు. అనంతరం, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన సాయిప్రసన్న దంపతులు రూ.2,500 చెల్లించి రథ సేవలో పాల్గొన్నారు. వారికి స్వామివారి కండువా, రవికెల వస్త్రం, ప్రసాదం ఇచ్చి, స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్ తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.