
దుర్గమ్మ ఆలయంలో చోరీ
● రూ.2.5 లక్షల విలువైన ఆభరణాలు చోరీ
● సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల విచారణ
తొండంగి: మండలంలోని పి.అగ్రహారంలో ఇటీవల పునర్నిర్మించిన దుర్గామాత ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు ఆలయకమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. పోలీసులు, ఆలయకమిటీ తెలిపిన వివరాల ప్రకారం పి.అగ్రహారంలో దుర్గామాత ఆలయాన్ని దాతల సహకారంతో పునర్నిర్మించారు. మార్చి 16న అమ్మవారి విగ్రహప్రతిష్ట జరిగింది. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో అమ్మవారికి వెండి కిరీటం, మూడు జతల శతమానాలు, వెండి కాసులపేరు అలంకరించారు. శనివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు నగల చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే రెండు రోజుల ముందు పగలు అమ్మవారిని దర్శించుకుని రెక్కీ నిర్వహించినట్టు కూడా ఫుటేజీలో రికార్డు అయ్యింది. దీంతో ఆదివారం ఉదయం అమ్మవారికి పూజ చేసేందుకు వెళ్లిన పూజారికి ఆలయ తాళాలు పగలుగొట్టి కనపడ్డాయి. తరువాత అమ్మవారి నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. నగల విలువ రూ.రెండున్నర లక్షలు ఉంటాయని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి తొండంగి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్‌రావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తొండంగి: గ్రామానికి చెందిన పల్లా శ్రీరాములు (59) ఈ నెల 14న ఽపొలం నుంచి ఎడ్ల బండిపై ధాన్యం బస్తాలు తీసుకువచ్చి ఇంట్లో వేస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో మెడపై బస్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శ్రీరాములు కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు. శ్రీరాములుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.