నిజామాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. పెద్దల సాక్షిగా, సమాజం ఒప్పుకునేలా ఇరువురి బంధువు లు, స్నేహితుల మధ్య జరిగే అద్భుతమైన ఘట్టం. అయితే ఆధునిక కాలంలో ఏడడుగులు నడిచి ఏడాది గడవకముందే మనస్పర్థలతో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురి తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
అహం వల్లే..
జిల్లాలో భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కే సులు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్నింటిలో పోలీసుల కౌన్సెలింగ్‌తో పరిష్కారం కనిపిస్తున్నా.. ఇంకొన్ని ఘటనలలో మొండిగా ప్రవర్తిస్తూ కేసుల వరకు వెళుతున్నారు.
చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పోలీసు స్టేషన్‌లో అయినా, కోర్టులో అయినా సరే సర్దుకుందామనే ఆలోచనకు రావడం లేదు. కొందరైతే పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో భార్య, భర్తలే కాకుండా వాళ్ల తల్లిదండ్రుల ఇగో కూడా విడాకులకు కారణమవుతోంది. సర్ది చెప్పాల్సిన పెద్దలే సమస్యను పెద్దదిగా చేసి విడుకులు ఇప్పిస్తున్నారు.
సామరస్యంగా మాట్లాడుకుంటే..
దంపతులు మొండి ధోరణి విడనాడి ఏ సమస్య తలెత్తినా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఎదుటివారిపై ఆధిపత్యానికి ప్రయత్నించవద్దు. జీతాలు, హోదాలు ఎలా ఉన్నా, అన్నీ తమ కుటుంబం కోసమే అన్న భావన పెంచుకోవాలి. తగాదాలు వస్తే సాధ్యమైనంత వరకు మూడో మనిషికి తెలియకుండా వారే పరిష్కరించుకోవాలి.
తప్పు ఎవరిదైతే వారు క్షమించమని అడిగితే పోయేదేమీ లేదు. ఒక్క చిన్న మాట ఎంతో మార్పుకు కారణమవుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు, వాటి పర్యవసానాలు పిల్లలపై పడకుండా చూసుకోవాలి. సంపాదన ఎంత అవసరమో సంతోషం కూడా అంతే అవసరమనే విషయాన్ని గుర్తించాలి.
ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా..
చిన్నచిన్న విషయాలకే భార్య, భర్తలు గొడవలు పడుతున్నారు. వాటిని పెద్దలు కూడా మరింత పెద్దవి చేస్తున్నారు. దీంతో కుటుంబాలు దెబ్బతింటున్నాయి. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు వెళ్లిన తర్వాత కౌన్సెలింగ్‌లు ఇచ్చినా చాలా మంది విడిపోతామనే చెబుతున్నారు. విడిపోవడమే పరిష్కారమన్న భావన పెరగడం మంచిది కాదు. భార్య, భర్తల మధ్య తలెత్తే చిన్నచిన్న గొడవలను కూర్చుండి పరిష్కరించుకోవచ్చు. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా సమస్య అప్పుడే పరిష్కారం అవుతుంది. పంతాలకుపోతే ఇరువురూ నష్టపోతారు. – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment