ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
కామారెడ్డి టౌన్: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, చట్టబద్ధంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు అన్నారు. ఇటీవల నిర్వహించిన సభలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్‌లు అందజేసి చట్టబద్ధత కల్పిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్‌ఎంసీ 34 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతే ప్రాక్టీస్ చేయాలని, 54 యాక్ట్ ప్రకారం తనిఖీలు చేసి చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న వైద్యులను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఎలాంటి విద్యార్హత లేని పీఎంపీ, ఆర్‌ఎంపీలకు సర్టిఫికెట్‌లను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము ఆర్‌ఎంపీ, పీఎంపీలకు వ్యతిరేకం కాదని, వారు గ్రామాల్లో ప్రాథమిక చికిత్స చేసేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. కానీ కొంత మంది ఇంజెక్షన్‌లు ఇస్తున్నారని, ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతూ, స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారని, కొంత మంది చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వైద్య వ్యవస్థను అవస్థలపాలు చేస్తే వైద్యులంతా సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం చట్టవిరుద్దమైన వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. సమావేశంలో ఐఎంఏ వైద్యులు పుట్ట మల్లికార్జున్, రమేశ్‌బాబు, చంద్రశేఖర్, ఉమారెడ్డి, నవీన్, జమాల్, రమేశ్ కొటాయ్, రవికిరణ్, గీరెడ్డి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్‌ఎంపీ, పీఎంపీలకు
సర్టిఫికెట్‌లు ఎలా ఇస్తారు..
హరీశ్‌రావు, కోదండరాం
వ్యాఖ్యలను ఖండించిన వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment