సేంద్రియ ఎరువుకు పెరిగిన డిమాండ్
బాల్కొండ: సేంద్రియ ఎరువులకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో రైతులు అనేక పద్ధతులు అవలంభిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రైతులు సేంద్రియ ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. గొర్రెల, మేకల పేడనే అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్క లారీ ఎరువు ధర రూ. 36 వేలు పలుకుతోంది. ఎకరం భూమికి కనీసం రెండు లారీల ఎరువును వేయాలని రైతులు అంటున్నారు. దీంతో పాటు నల్ల మట్టి, రసాయన ఎరువులు కూడా వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సేంద్రియ ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పోషకాలు ఎక్కువగా ఉండటంతోనే..
గొర్రెల, మేకల పేడలో పోషకాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ప్రధానంగా వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. దీంతో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ ఎరువు మంచిగా పని చేస్తుంది. పసుపు భూమిలో ఉండే పంట కావడంతో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. గొర్రెల, మేకల పేడను ఎక్కువగా వినియోగిస్తే వెచ్చదనం ఎక్కువగా ఉండటం వలన తేమ శాతం ఎక్కువగా ఉండదు. ఈ ఎరువులో ప్రధాన, సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ధర అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువును సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క లారీ ఎరువు ధర రూ. 36 వేలు
ధరలు ఎక్కువగా అయ్యాయి
సేంద్రియ ఎరువుల ధరలు ఎక్కువగా అయ్యాయి. లారీ ఎరువు రూ. 36 వేలు పలుకుతుంది. పసుపు పంటను సాగు చేసేందుకు వీటిని తప్పకుండా పోయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం సేంద్రియ ఎరువులను సబ్సిడీపై సరఫరా చేయాలి.
– గంగారెడ్డి, రైతు, కొత్తపల్లి
Comments
Please login to add a commentAdd a comment