దేగాంలో యువకుడిపై కత్తిపోట్లు
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామంలో ఆదివారం ఐనార్ల నాగరాజు అనే యువకుడిపై గ్రామానికి చెందిన కొందరు పాత కక్షలతో పదునైన ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుని తండ్రి గంగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేగాంకు చెందిన గంగరాజు, అతని సోదరునికి గ్రామానికి చెందిన దగ్గరి బంధువులతో రెండేళ్ల క్రితం గొడవలు ఏర్పడ్డాయి. ఇరువర్గాల గొడవ కుల పంచాయితీకి రాగా గంగరాజు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ విషయమై అతను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా గంగరాజు కుటుంబంపై దగ్గరి బంధువులకు విద్వేషం ఇప్పటికి కొనసాగుతోంది. గంగరాజు సోదరుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం గంగరాజు కుమారుడు నాగరాజు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద బంధువులైన శ్రీకాంత్, శ్రీధర్, క్రాంతి, అయినార్ల అశోక్, అయినార్ల శేఖర్, శ్రీలత, బద్దెమ్మలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అందరూ నాగరాజును ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అలాగే నాగరాజుపై దాడి చేసిన వారు సైతం గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నాగరాజును తండ్రి గంగరాజు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. నాగరాజుకు చికిత్సలు చేస్తున్న సమయంలో ఘర్షణలో గాయపడ్డవారు సైతం ఆస్పత్రికి వచ్చారు. మళ్లీ వారు నాగరాజుపై దాడి చేయడానికి యత్నించారు. ఆస్పత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వైద్య సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని నాగరాజును మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా ఎస్‌హెచ్‌వో సత్య నారాయణగౌడ్ మాట్లాడుతూ ఘర్షణపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment