పట్టభద్రుల సీటూ కమలానిదే
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి,పెద్దపల్లి: నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.
సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గతనెల 27న జరగ్గా, ఈనెల 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800 మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లును వడపోసి, కట్టలు కట్టారు. అదేరోజు రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ప్రారంభించి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న 56 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారి బ్యాలెట్ పేపర్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు.
త్రిముఖ పోటీలో..
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 92.52 శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు.
రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా
నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. తొలుత 53 మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 73,644 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి కి 63,404 ఓట్లు వచ్చాయి. 53 మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతడికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది.
అధిక ఓట్లతో గెలిచిన
బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
మూడురోజులు సాగిన
ఎమ్మెల్సీ కౌంటింగ్
ముగ్గురికే 92.52 శాతం ఓట్లు
పట్టభద్రుల సీటూ కమలానిదే
Comments
Please login to add a commentAdd a comment