ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 38 సెంటర్‌లలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 96.02 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 9,230 మంది విద్యార్థులకుగాను 8,863 మంది పరీక్ష రాశారు. మొదటి రోజు కావడంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. దాదాపు విద్యార్థులందరూ పరీక్ష సమయంలోపు కేంద్రాలకు చేరుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీఆర్యభట్ట జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. పరీక్ష కేంద్రాలలోనికి పంపించే సమయంలో ప్రతి విద్యార్థిని పరిశీలించాలన్నారు. అనధికార వ్యక్తులను లోనికి పంపించరాదన్నారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు. తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాగా నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాల్సి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో ఈ నిబంధన అమలు కాలేదు. పరీక్ష నిర్వహిస్తున్న సమయంలోనూ పలుచోట్ల జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉన్నాయి.
96.02 శాతం విద్యార్థులు హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద సందడి
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment