‘రైతు భరోసా’ అందేదెప్పుడో?
బాన్సువాడ : ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. ఇప్పటివరకు మూడెకరాల్లోపు రైతులకు మాత్రమే నగదు జమ అయ్యింది. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 34,526 మంది రైతులు రైతు భరోసాకు అర్హత కలిగి ఉన్నారు. అయితే ఇప్పటివరకు 24,688 మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యాయి. మూడెకరాలలోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించామని సర్కారు చెబుతోంది. అయితే తమకు మూడెకరాలలోపు భూమి ఉన్నా రైతు భరోసా డబ్బులు రాలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి నిత్యం బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా కొందరు రైతులు సేవింగ్ ఖాతాలకు బదులు పంట రుణం ఖాతా నంబరు ఇచ్చారని, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ పేర్లలో తప్పిదాలు, ఇటీవల భూములు కొనుగోలు చేసిన కొత్త రైతులకు డబ్బులు కాలేదని అధికారులు సమాధానమిస్తున్నారు. కాగా మూడు మండలాల పరిధిలో మూడెకరాలపైన భూమి ఉన్న రైతులు సుమారు పది వేల మంది వరకు ఉన్నారు. వారంతా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా పెట్టుబడి సాయం అందించాలని కోరుతున్నారు.
కొందరి ఖాతాల్లోనే నిధులు జమ
వేలాది మంది రైతులకు తప్పని నిరీక్షణ
Comments
Please login to add a commentAdd a comment