కస్టడీలోని యువకుడి మృతితో కలకలం | - | Sakshi
Sakshi News home page

కస్టడీలోని యువకుడి మృతితో కలకలం

Published Sat, Mar 15 2025 1:58 AM | Last Updated on Sat, Mar 15 2025 1:57 AM

కస్టడీలోని యువకుడి మృతితో కలకలం

కస్టడీలోని యువకుడి మృతితో కలకలం

ఖలీల్‌వాడి : సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని వడ్డెర కాలనీకి చెందిన అలకుంట సంపత్‌ (31) జగిత్యాల జిల్లాలోని శ్రీరామ ఇంటర్నేషనల్‌ మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సంపత్‌తోపాటు జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రంగపేటకు చెందిన చిరంజీవి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్‌కు చెందిన మిట్టాపల్లి నర్సారెడ్డిలు పనిచేస్తున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష వసూలు చేశారు. కొంతమందిని లావోస్‌ దేశానికి డేటాఎంట్రీ ఆపరేటర్ల పేరిట పంపించారు. తీరా అక్కడ సైబర్‌నేరాలు చేయించడంతో బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. అనంతరం ఆలకుంట సంపత్‌, చిరంజీవి, నర్సారెడ్డిలపై జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ముగ్గురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 12న కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ నిమిత్తం జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా, గురువారం రాత్రి సంపత్‌ ఎడమ చేయి లాగుతోందని పోలీస్‌ సిబ్బందికి చెప్పడంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఫిట్స్‌ రావడంతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సంపత్‌ మృతి విషయాన్ని గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు తమకు చెప్పినట్టు కుటుంబీకులు తెలిపారు.

ఫస్ట్‌క్లాస్‌ జడ్జి సమక్షంలో..

సంపత్‌ మృతదేహానికి ఫస్ట్‌క్లాస్‌ జడ్జి హరికృష్ణ సమక్షంలో ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టును సీపీ సాయిచైతన్యకు అందించారు. సంపత్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

గుండె సమస్యతో మృతి చెందాడు

‘అలకుంట సంపత్‌ గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందాడు. సంపత్‌ శ్రీరామ ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ పవర్‌ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతను థాయిలాండ్‌, మయన్మార్‌, లావోస్‌ తదితర ప్రాంతాలకు పంపించేవాడు. మోసపోయిన వారి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు గురువారం జగిత్యాలలోని సంపత్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారణ చేశారు. అదే రోజు రాత్రి ఎడమ చేయి, ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో పోలీసులు జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. జీజీహెచ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో సంపత్‌ నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించాం. జీజీహెచ్‌కు వెళ్లిన తర్వాత సంపత్‌ కుప్పకూలిపోయాడు. వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. సంపత్‌ మృతిపై ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ కొనసాగుతోంది.’ అని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సమగ్ర విచారణ జరపాలి

సంపత్‌ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం జీజీహెచ్‌కు చేరుకున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త సంపత్‌ మృతి చెందాడని భార్య ఆరోపించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని జీజీహెచ్‌ ఎదుట ఉన్న రోడ్డుపై ధర్నా చేశారు. న్యాయం చేస్తామని, జడ్జి సమక్షంలో వీడియో రికార్డింగ్‌ ద్వారా పోస్టుమార్టం చేయించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు.

పోలీసులు కొట్టడంతోనే మృతి

చెందాడని కుటుంబీకుల ఆందోళన

జీజీహెచ్‌ ఎదుట ధర్నా

ఫస్ట్‌క్లాస్‌ జడ్జి సమక్షంలో పోస్టుమార్టం

కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందినట్లు

ప్రకటించిన సీపీ సాయి చైతన్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement