తండ్రిని హతమార్చిన తనయుడు
ధర్పల్లి: తన అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన ధర్పల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి సైతం కొడుకుకు సహకరించడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపెట్ గ్రామానికి చెందిన పాలెం చిన్న మల్లయ్య (65)కు భార్య లక్ష్మి, కొడుకు మధు ఉన్నారు. మల్లయ్య తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఆవుల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నారు. కొడుకు వివాహం జరుగగా, పొలం పనులు చేసుకుంటు ఉండేవాడు. డబ్బుల విషయంలో మల్లయ్యతో లక్ష్మి, కొడుకు మధు తరచూ గొడవపడేవారు. శనివారం రాత్రి గ్రామంలో ని ఒక కిరాణా దుకాణం వద్ద తనకు డబ్బులు కావాలని కొడుకు, తండ్రితో గొడవకు దిగగా, స్థానికులు సర్ధిచెప్పారు. కానీ కోపం పెంచుకున్న కొడుకు తండ్రిని చంపాలని నిర్ణయించుకొని, బీరు సీసాతో ఇంటికి వెళ్లాడు. గొడవ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఇద్దరు కలిసి మల్లయ్యతో గొడవకు దిగారు. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి మల్లయ్య గొంతు పట్టుకొని కిందకు పడేశారు. వెంటనే మధు, మల్లయ్యపై సీసాతో దాడి చేశారు ఈ క్రమంలో మల్లయ్య తలకు గాయమై, రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను ఆదివారం రిమాండ్ కు తరలించారు.
సహకరించిన తల్లి
డబ్బులు ఇవ్వడం లేదని ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు
Comments
Please login to add a commentAdd a comment