ఆఫీసర్ లోపల.. బయట తాళం
● ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు తాళం వేసిన మతిస్థిమితం లేని వ్యక్తి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ అతిథి గృహంలో అధికారి విశ్రాంతి తీసుకుంటుండగా, మతిస్థితిమితం లేని వ్యక్తి బయట నుంచి తాళం వేసి వెళ్లిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం రాత్రి విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక అధికారి విశ్రాంతి తీసుకున్నారు. గెస్ట్‌హౌస్ సిబ్బంది వస్తే ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు లోపల నుంచి గొళ్లెం పెట్టకుండా తాళం సోఫాపై పెట్టి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పైఅంతస్తులోకి వెళ్లగా అదే సమయంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నేరుగా గెస్ట్‌హౌస్ లోపలికి వచ్చి సోఫాపై ఉన్న తాళం తీసుకుని డోర్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. కాసేపటికి కిందికి వచ్చిన అధికారి.. డోర్‌కు బయటి నుంచి తాళం వేసి ఉండడంతో కంగుతిన్నాడు. సిబ్బందికి ఫోన్ చేయగా, సుమారు గంటపాటు శ్రమించి తాళం తీశారు.
తాగునీటి కోసం తండ్లాట
మాచారెడ్డి : మండలంలోని మైసమ్మచెరువు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దుర్గమ్మగుడి తండాలో తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. 25 కుటుంబాలు నివసిస్తున్న తండాలో ఉన్న ఒక్క బోరు వట్టిపోయింది. దీంతో ఆ తండా వాసులు కిలోమీటరు దూరంలో ఉన్న పంట చేల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొందరు పంట చేలకు రానీయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తండాలో నెలకొన్ని నీటి ఎద్దడిని తీర్చాలని కోరారు.
వాహనాల తనిఖీ
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ బైపాస్ వద్ద దేవునిపల్లి పోలీసులు గురువారం విస్తృతంగా వాహనాల తనిఖీల చేపట్టారు. పాత ఫైన్‌లు వసూలు చేయడంతో పాటు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దేవునిపల్లి ఎస్సై రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. స్పీడ్‌గన్ ఉందనీ, నిర్ణీత వేగం దాటితే జరిమానాలు తప్పవన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నిజాంసాగర్(జుక్కల్): సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివకుమా ర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సమాఖ్య సమావే శంలో ఆయన మాట్లాడారు. మానవ అభివృద్ధి విభాగంలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు దుడ్డె. అనిత, ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి తదితరులున్నారు.
ఆఫీసర్ లోపల.. బయట తాళం