
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
బాన్సువాడ: మండలంలోని కొల్లూర్ సమీపంలో ఇటీవల జరిగిన అమృతం విఠల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈమేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విఠల్(34) అనే వ్యక్తిని ఈ నెల 29న కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలో దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లారు. పోలీసులు గ్రామంలో విచారించగా మృతుడి భార్య కాశవ్వ గ్రామానికి చెందిన అమృతం విఠల్ అనే వ్యక్తితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. దీంతో భర్తకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటంతో అతడి అడ్డు తొలగించుకోవాలని కాశవ్వ నిర్ణయించుకుంది. తన భర్తను చంపితే డబ్బులు ఇస్తానని చెప్పి కాశవ్వ తన బంగారాన్ని తనఖా పెట్టి ఈ నెల 28న రూ.18 వేలు తెచ్చి నిందితుడు విఠల్‌కు ఇచ్చింది. అదేరోజు నిందితుడు విఠల్‌ను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని దుర్కికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి కల్లు తాగించి, అనంతరం పుల్కంటి విఠల్, అమృతం విఠల్ కలిసి గొంతుకు టవల్ బిగించి పైపులతో కొట్టి చంపారు. మృతి దేహాన్ని కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలోని బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. విచారణ అనంతరం కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.