తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి కామారెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఉత్పన్నం కాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్న పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండు సార్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించాలన్నారు.సమావేశంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, తాగునీటి అవసరాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, జీపీల నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ