విద్యార్థులకు పరీక్షే!
నిజాంసాగర్: పదో తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లడం అచ్చంపేట ఎస్సీ గురుకుల విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 76 మంది ఉన్నారు. వీరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అక్కడికి వెళ్లి రావడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో గురుకుల అధికారులు ట్రాలీ ఆటోలో పంపిస్తున్నారు. 38 మంది చొప్పున రెండు ట్రిప్పుల్లో వెళ్లి వస్తున్నారు. ట్రాలీతోపాటు టాప్‌పైనా కొందరు విద్యార్థులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. పరీక్ష అనంతరం గురుకులానికి తిరిగి వచ్చే సమయంలో ఎండ తీవ్రంగా ఉంటోంది. మండుటెండలో ప్రయాణించాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సరైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
● గురుకులం నుంచి పరీక్ష కేంద్రానికి రవాణా వసతి కరువు
● ట్రాలీ ఆటోలో ప్రమాదకర ప్రయాణం
● ఒక్కో ట్రిప్‌లో 38 మందిని
తరలిస్తున్న వైనం