
నిరంతరం ప్రజల్లోనే ఉండండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మీరంతా ప్రజల్లోనే ఉండండి. భవిష్యత్తు మనదే’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. బుధవారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నియోజక వర్గాల ఇన్‌చార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో బీఆర్‌ఎస్ రజతోత్సవాల గురించి సమీక్షించారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే సభను విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారికి వివరించారు. సమావేశం వివరాలను బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. తెలంగాణపై మనకున్న అవగాహన మరెవరికీ ఉండదని, ప్రజలకు మేలు చేయాలన్న ఆర్తి మనకే ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ నొక్కిచెప్పారని జిల్లా నేతలు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించాన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన వారిలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, పార్టీ నాయకురాలు అయేషా ఫాతిమా తదితరులున్నారు.
బీఆర్‌ఎస్ నేతలకు
దిశానిర్దేశం చేసిన కేసీఆర్
పార్టీ రజతోత్సవాలపై
ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష