
తెల్లారితే కొడుకు పెళ్లి..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
రుద్రూర్: కొడుకు పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్న తండ్రి కానరాని లోకానికి వెళ్లిపోయాడు. భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో రోదనలు మిన్నంటాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన తండ్రి గొర్ల నాగయ్య (52) కుమారుడి వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. పోతంగల్ మండలం కారేగాం గ్రామంలో పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు నాగయ్య శనివారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. హంగర్గా ఫారం సమీపంలో బైక్‌కు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టుకు ఢీకొన్నాడు. తీవ్రగాయాలైన నాగయ్యను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగయ్య మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, నాగయ్య మిషన్ భగీరథలో హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.