
బొప్పాపూర్‌లో పోలీసులకు చేదు అనుభవం
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్‌లో మహిళ మృతి విచారణకు వెళ్లిన పోలీసులకు చేదు అను భవం ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగవ్వ(50) ఆదివారం ఉదయం మృతి చెందింది. మహిళది సహజ మరణం కాదంటు మండల కేంద్రంలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయమై విచారణ నిమిత్తం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్లారు. అప్పటికే శవయాత్ర కొనసాగుతోంది. శవయాత్రను అడ్డుకున్న పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దింపుడు కళ్లెం దాటిన తర్వాత ఆపితే గ్రామానికి అరిష్టం వస్తుందని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టంకు అంగీకరించేది లేదంటూ శ్మశాన వాటికలో దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళ సహజంగానే మరణిస్తే పోలీసులతో ఎందుకు వాగ్వాదానికి దిగారు. పోస్ట్‌మార్టం చేయడానికి అంగీకరించక పోవడం అనుమానానికి తావిస్తోంది. పోలీసులు మహిళ ఎలా మృతి చెందిందనే విషయమై గ్రామంలో విచారణ చేపడుతున్నారు.