
గ్రామీణ విద్యార్థులకు పట్టుదల ఎక్కువ
భిక్కనూరు: పట్టణ ప్రాంత విద్యార్థులకంటే గ్రామీ ణ ప్రాంత విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌ను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. సౌత్‌క్యాంపస్ సమస్యలను వైస్‌చాన్స్‌లర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానన్నారు. అనంతరం బాలకల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, అధ్యాపకులు మోహన్‌బాబు, సబిత, హరిత, లలిత, అంజయ్య, నారాయణ, రమాదేవి, నర్సయ్య ఏపీఆర్‌వో సరిత పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కోరారు. ఈ విషయమై వారు సోమవారం వినతి పత్రం అందించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులకు పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణగుప్తా, యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, శ్రీకాంత్, నిరంజన్, దిలీప్, సరిత పాల్గొన్నారు.
50 పడకల ఆస్పత్రి
నిర్మాణానికి స్థల పరిశీలన
దోమకొండ : మండల కేంద్రంలో 50 పడకల ఆ స్పత్రి నిర్మాణానికి అధికారులు సోమవారం స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐడీపీ అధికారి కుమార్ నరసింహ, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి తదితరు లు మండల అధికారులతో కలిసి మండల కేంద్రంలోని దేవునికుంట, గుండ్ల చెరువు ప్రాంతం, ముత్యంపేట రోడ్డు ప్రాంతాలలోని స్థలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారుల తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సంజయ్‌రావ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు తిరుమల్‌గౌడ్, స్వామి, మధుసూదన్, రామస్వామిగౌడ్, తదితరులున్నారు.
తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్‌లాగ్ 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చే యకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు నిరాకరించడంతో వాయిదా వేసినట్లు సమాచారం.

గ్రామీణ విద్యార్థులకు పట్టుదల ఎక్కువ