కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 39వ డివి జన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాత ఫలితమే పునరావృతమైంది. ప్రస్తుత కార్పొరేటర్, బీఆ ర్‌ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ ఓట్ల రీకౌంటింగ్ నిర్వహించగా, అభ్యర్థులంతా గత ఓట్లనే సాధించారు. 2020 జనవరిలో జరిగిన నగరపాలకసంస్థ ఎన్నికల్లో 39వ డివిజన్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి వూట్కూరి మంజుల భార్గవిపై విజయం సాధించారు.
అయితే బ్యాలెట్ పత్రాలు తారుమారాయ్యాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని మంజుల భార్గవి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో 39వ డివిజన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగింది. జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో న్యాయవాది, ప్రభుత్వ ఉద్యోగులు, నగరపాలకసంస్థ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్‌చేసి ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో 2020 జనవరి ఎన్నికల్లో వచ్చిన తరహాలోనే అభ్యర్థులు ఓట్లు సాధించారు. ఓట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో కొండపల్లి సరితను విజేతగా జిల్లా న్యాయమూర్తి ప్రకటించారు.
ధర్మమే గెలిచింది
రీ కౌంటింగ్‌లోనూ ధర్మమే గెలిచింది. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా జరిగాయి. ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు సహకారంతో డివిజన్ సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా.
– కొండపల్లి సరిత, కార్పొరేటర్
అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అన్నమనేని నిహారిక
(బీజేపీ) 466
కొండపల్లి సరిత (బీఆర్‌ఎస్) 876
జ్యోతి ఉప్పుగండ్ల (కాంగ్రెస్) 31
కోట శారద (స్వతంత్ర) 120
మంజుల భార్గవి వూట్కూరి (స్వతంత్ర) 830
సునీత గూడ(స్వతంత్ర) 49
ఫలితం: 46 ఓట్ల తేడాతో
బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండపల్లి సరిత గెలుపు
39వ డివిజన్ ఓట్ల వివరాలు
మొత్తంఓట్లు 3,898
పోలైనవి 2,401
చెల్లనివి 18
నోటా 11
Comments
Please login to add a commentAdd a comment