మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్
సాక్షి, కరీంనగర్: ‘ఎన్నికల్లో ఓటర్లకు బీజేపీ తరఫున ఒక్క రూపాయి పంచబోము.. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణలో ఆదర్శ రాజకీయాలకు.. పెనుమార్పులకు వేదిక అవుతోంది’ అని కోరుట్ల బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మోదీ కోరుకున్న ఆదర్శపాలనకు కోరుట్ల కేంద్రంగా మారబోతుందన్నారు. సీఎం కేసీఆర్ నుంచి కోరుట్ల సెగ్మెంట్‌లోని కల్వకుంట్ల కుటుంబం దాకా..పెరిగిన అహంకారాన్ని వంచుతానన్నారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ గొప్పలు చెబుతుంటే రాష్ట్రం అక్షరాస్యతలో 31వ స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీ షికాగోలా మార్చుతానని చెప్పిన కవిత ఇప్పుడేం సమాధానం చెబుతుందని అడిగారు. మోదీ ప్రభుత్వం వరి, పసుపు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరిట రైతులను ఇబ్బందులు పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అవినీతి జరిగినందుకే మూడేళ్లకే మేడిగడ్డ వంతెన కుంగిందని.. పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి చెబుతామన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ క్లీన్ గవర్నమెంట్‌కు ప్రతీకగా మారుతుందన్నారు. కాంట్రాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు ఎవరికి అప్పనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ పేరు చెప్పి కంటి వెలుగు అద్దాల్లో కమీషన్లు దండుకుంటున్న ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.
కొంత మంది బీఆర్‌ఎస్ బ్రోకర్లు నన్ను నాన్‌లోకల్ అంటున్నారని.. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు సిరిసిల్ల లోకల్ అయితే.. రాష్ట్ర రాజకీయాలను శాసించిన డీఎస్ కొడుకు అర్వింద్‌కు కోరుట్ల ఎలా నాన్‌లోకల్ అవుతుందని ప్రశ్నించారు. కోరుట్లలో పుట్టిన నాకు కోరుట్ల సొంత సెగ్మెంట్‌గానే ఉంటుందన్నారు. జగిత్యాలలో బోగ శ్రావణిని గెలిపించే బాధ్యత తనదేనన్నారు. రానున్న కాలంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల ఆయన అనుచరులు అవినీతి చిట్టా విప్పుతామన్నారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, జగిత్యాల బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రావణి, నాయకులు సురభి నవీన్, జేఎన్ వెంకట్, డాక్టర్ రఘు, రాజశేఖర్, సుఖేందర్‌గౌడ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment