మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం.. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటా.. ప్రజల సమస్యలు తీరుస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా తొలిసారి సైదాపూర్‌కు వచ్చారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. వెన్కెపల్లి సహకార సంఘం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాలవారీగా కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా దశలవారీగా పరష్కరిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడవకుండానే హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ అంటించి మోసం కేసులు పెడతామని బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పదేళ్లలో ఇచ్చిన వందల హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై సెక్షన్ 379(థెప్టు) కింద తెలంగాణ ప్రజల ఆస్తిని దొంగతనం కేసు, 384 సెక్షన్ కింద(ఎక్స్‌టార్షన్) అధికార బలంతో ప్రజల సొమ్మును భయపెట్టి లాక్కొన్న కేసు, 382 సెక్షన్ కింద రాబరీ కేసు, 395 సెక్షన్ కింద(డెకాయిట్) దారిదోపిడీ కేసులు వేయడానికి సిద్ధమన్నారు.
తాను ఎంపీగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినోడు అప్పుడు కాలుకు స్లిప్పర్లు లేవు కానీ.. ఇప్పుడు ఫాంహౌస్‌లు కట్టుకొని రూ.కోట్లకు అధిపతులయ్యారని అన్నారు. నాసికరం పనులు చేసి లక్షల కోట్లు దండుకొని కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లకే కూలిందన్నారు. సహచర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పదేళ్లు అధికారం వెలగబెట్టిన వ్యక్తికి అభివృద్ధిపై అవగాహన లేదన్నారు. 2014కు ముందు జరిగిన సాగునీటి కాలువల పనులు, తారు రోడ్లు, పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఒక బడి, కాలువ, రోడ్డు పోసిన పాపాన పోలేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇప్పటికే అధికారులతో మాట్లాడనని, మార్చి తర్వాత పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గోదావరిఖని–కట్కూర్ బస్సు, హుజూరాబాద్ వయా సర్వాయిపేట హుస్నాబాద్ బస్సును పునరుద్ధరిస్తానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతమైన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, మిట్టపెల్లి కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, ఎంపీటీసీ, మండల మహిళాధ్యక్షురాలు చాడ చైతన్యారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మ్యాకల రవీందర్, డీసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, రాఘవులు, సింగిల్‌విండో డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, బొమ్మగాని రాజు, నవీన్, శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment