రేషన్‌కార్డు రాదాయె..
● ఫలించని లబ్ధిదారుల ఎదురుచూపు ● కొత్త అర్జీలు సరే.. పాతవాటి పరిస్థితేంటి? ● ఏళ్లుగా మంజూరుకాని వైనం ● దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ
కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్ ప్రాంతానికి చెందిన చిట్ల రంజిత్ 2018 సెప్టెంబర్‌లో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రక్రియ పూర్తవగా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించారు. డిజిటల్ సైన్ కావాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కింది. ఫలితంగా రంజిత్‌కు రేషన్‌కార్డు మంజూరుకాలేదు. ఇది ఒక రంజిత్ పరిస్థితే కాదు. జి ల్లాలో వేలాది మంది పడుతున్న ఇబ్బంది.
కరీంనగర్ అర్బన్..●:
రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఏళ్లుగా మంజూరుకాకపోవడం.. ప్రతీసారి దరఖాస్తు చేసుకోవడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. కొత్త రేషన్‌కార్డుల కోసం అర్జీల సంగతి దేవుడెరుగు.. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే మోక్షం లేదు. 2018లో దరఖాస్తు చేసిన వాటికి ఇప్పటికీ మోక్షం లేదు. ఇప్పటికే 18 వేల దరఖాస్తులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఏళ్ల తరబడి రేషన్‌కు దూరం
2018లో జిల్లాలో రేషన్‌కార్డు కోసం 34,293 దరఖాస్తులు రాగా.. 15,114 మాత్రమే మంజూరయ్యాయి. కరీంనగర్ అర్బన్‌తోపాటు 15 మండలాల్లో భారీగా అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించి మంజూరు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్జీల్లో వివిధ కారణాలతో 831 తిరస్కరణకు గురవగా వివిధ దశల్లో 18,348 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 మార్చిలో కరోనా ప్రభావంతో కార్డుదారులందరికీ ఉచితంగా రేషన్ అందింది. ఆ సమయంలోనూ దరఖాస్తుదారులకు ఏమి దక్కలేదు. ఒక్కో వ్యక్తికి 12కిలోలు కాగా ఒక్కో కార్డుకు రూ.1500 సాయం ప్రకటించగా అన్ని అర్హతలున్న 18వేలకు పైగా కుటుంబాలు సాయానికి దూరమయ్యాయి.
ఎందుకింత నిర్లక్ష్యం?
మీ సేవ కేంద్రాల ద్వారా అర్జీదారులు దరఖాస్తు చేయగా వాటిని ఆర్‌ఐ(గిర్దావర్) క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైతే తహసీల్దార్‌కు నివేదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించని కుటుంబాలే అర్హులు. కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. మీసేవలో స్వీకరించిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తారు. అర్జీదారుడి ఆదాయ వనరులు, నివాస ప్రాంతం తదితరాలపై ఆరా తీసి అర్హులనిపిస్తే కార్డు జారీకి అమోదముద్ర వేస్తారు. అయితే సదరు ప్రక్రియ వేగవంతంగా సాగాల్సి ఉండగా ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటుంది. ఆర్‌ఐ, తహసీల్దార్ ఆమోదించిన అర్జీలకు డిజిటల్ సైన్‌తో ఆమోదం తెలపాల్సిన పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనే 8,266 పెండింగ్ ఉండటం గమనార్హం. ఆర్‌ఐల వద్ద 9,626, తహసీల్దార్ల వద్ద 456 పెండింగ్‌లో ఉన్నాయి.
మీసేవ కేంద్రాల్లో దోపిడీ
కొత్త రేషన్‌కార్డుల కోసం అర్జీలకు ప్రభుత్వం అవకాశమివ్వగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా దోచుకుంటున్నారు. నిర్ణీత రుసుం కన్న ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. త్వరలోనే పాత, కొత్త దరఖాస్తులకు మంజూరు లభిస్తుందని, అదనంగా వసూలు చేసే మీసేవ కేంద్రాలపై చర్యలు ఉంటాయని పౌరసరఫరాల అధికారి వివరించారు.
జిల్లాలో అర్జీల పరిస్థితి
మొత్తం దరఖాస్తులు : 34,293
తిరస్కరణ : 831
పెండింగ్ : 18,348
గిర్దావర్ వద్ద పెండింగ్ : 9,626
తహసీల్దార్ వద్ద పెండింగ్ : 456
డీఎస్వో ఆఫీస్‌లో : 8,266
జారీ అయిన కార్డులు : 15,114
రేషన్‌కార్డుల పెండింగ్ ఇలా
మండలం ఆర్‌ఐ డీఎస్‌వో
చిగురుమామిడి 257 495
చొప్పదండి 649 338
ఇల్లందకుంట 214 303
గంగాధర 323 562
గన్నేరువరం 179 250
హుజూరాబాద్ 1001 382
జమ్మికుంట 603 677
కరీంనగర్ రూరల్ 698 477
కరీంనగర్ అర్బన్ 2630 1861
శంకరపట్నం 264 538
కొత్తపల్లి 988 251
మానకొండూర్ 206 590
రామడుగు 120 425
సైదాపూర్ 498 227
తిమ్మాపూర్ 385 564
వీణవంక 611 326
Comments
Please login to add a commentAdd a comment