పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కేంద్రాల్లో ఉండొద్దన్నారు. పరీక్షలు జరిగే తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రథమ సంవత్సరం 17,799, ద్వితీయ సంవత్సరానికి 17,763 మంది పరీక్షలు రాస్తారన్నారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేయగా, కరీంనగర్‌లో 37 సెంటర్లు ఉన్నాయని అన్నారు. డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ వచ్చే నెల 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 12,516 మంది పరీక్షలు రాస్తారని వివరించారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్టీసీ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment