తీర్పు రాకముందే సీఈసీ ప్రకటనా?
కరీంనగర్: సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీని ఎలా ప్రకటిస్తారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీలో చర్చించకుండా సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ను ఏకపక్షంగా ప్రకటించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తున్నామని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పార్టీలు మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టుల గురించి కేసీఆర్ మాట్లాడటం అంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనన్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజలింగ మూర్తి హత్య అనేక అనుమానాలు తావిస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment