పది రోజుల్లో కూతురి పెళ్లి.. అంతలోనే విషాదం
ముస్తాబాద్(సిరిసిల్ల): పది రోజుల్లో పెళ్లి భాజభజంత్రీలు మోగాల్సిన ఇంటిలో చావుడప్పు వినిపించింది. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పెళ్లి కూతురు తల్లి మృతిచెందడంతో ఆ ఊరిలో విషాదం అలుముకుంది. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన చిన్ని అంజమ్మ(52) శుక్రవారం ఉదయం ఇంటి ఆవరణలో చెత్తకు నిప్పు పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటున్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు అంజమ్మను సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. అంజమ్మ పెద్దకూతురు భాగ్య వివాహం మార్చి 2న ఉంది. పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు అంజమ్మ భర్త బాల్‌రెడ్డి వెళ్లాడు. పది రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంటిలో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్సై గణేశ్ పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment