జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ చుట్టు పక్కల రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చు లేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట సరఫరా చేస్తున్నది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు అడ్డదారులు తొక్కారు. బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి దిగజారారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతంలోని ఏడు మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగానికి అవాక్కయ్యారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఒక మిల్లరు అక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించినట్లు పక్కా సమాచారం. అలాగే శంకరపట్నం మండలం మొలంగూర్‌లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం మిల్లర్ల బరితెగింపుకు తార్కాణం.
Comments
Please login to add a commentAdd a comment