తోడు కోసం ఆడపులి అన్వేషణ
మంథని: తోడు కోసం ఆడపులి అన్వేషిస్తోంది. 15 రోజులుగా జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దాని అడుగులను బట్టి అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కరీంనగర్ తూర్పు, పశ్చిమ అడవులు మూడు దశాబ్దాల క్రితం దట్టంగా ఉండేవి. ఆ సమయంలో పులులతోపాటు ఇతర అటవీ జంతువులు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత అడవులు అంతరించిపోయి మళ్లీ దట్టంగా మారుతుండటంతో పులి తోడు కోసం వెతుకుతూ వస్తోంది. 2020లో దేవాదుల మీదుగా ఏటూరునాగారం, అజాంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి సంచరించింది. 2022లో హుస్సేనిమియా వాగు సమీపంలో పులి అడుగులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు గోదావరి, మానేరు తీరం వెంట ఆడపులి సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు.
చెన్నూర్ అడవుల నుంచి మంథనికి..
ఈ పులి మంచిర్యాల జిల్లా చెన్నూర్ అడవుల నుంచి మంథని అడవుల్లోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాని వయసు మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుందని, అడుగులు 12 సెంటీమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ కోయ చెరువు అటవీ ప్రాంతంలో అడుగులు గుర్తించిన రైతులు ఆందోళనకు గురై, సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.
కెమెరాకు చిక్కితే పూర్వాపరాలు..
పులి ప్రతీరోజు రాత్రివేళల్లో 20 నుంచి 40 కి.మీ. ప్రయాణిస్తోందని అఽధికారులు అంటున్నారు. కెమెరాకు చిక్కితే వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా దాని పూర్వాపరాలు తెలుసుకుంటామంటున్నారు. పులి కోసం నీరు, ఆహార ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తీరం వెంట ట్రాకింగ్ బృందాలు
పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు దాని జాడ కోసం రెండు ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. గోదావరి, మానేరు తీరం వెంట ఆనవాళ్లు ఉన్న ప్రాంతంలో ఒకటి ముందు, మరొకటి వెనక అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
ఆందోళనలో ప్రజలు..
గోదావరి, మానేరు తీరం వెంట పులి అడుగులు కనిపిస్తుడటంతో అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాల వైపు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు.
అటవీ ప్రాంతాల జల్లెడ
ముత్తారం(మంథని): బేగంపేట అటవీ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య, స్థానిక బీట్ ఆఫీసర్లు అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి జాడ కోసం సోమవారం జల్లెడ పట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీ చేశారు. కోయచెరువు గుడ్డెలుచెలుక ప్రాంతంలో పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించినా.. ఆ తర్వాత అది ఎటువైపు వెళ్లిందనే దానిపై స్పష్టత రాలేదని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే పఽశువుల కాపరులు, పొలాల వద్దకు వెళ్లే రైతులు, ప్రయాణాలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోజుకు 20 నుంచి
40 కి.మీ. ప్రయాణం
15 రోజులుగా గోదావరి, మానేరు తీరం వెంట సంచారం
చెన్నూరు అడవుల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న అధికారులు
అటవీ గ్రామాల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment