నీళ్లగంట.. ఆరోగ్యమట!
● జిల్లాలో అమలుకాని ‘వాటర్‌బెల్’ కార్యక్రమం ● ఇంటినుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు ● ముదురుతున్న ఎండలు.. చదువులపై ప్రభావం ● నీళ్లు ఎక్కువగా తాగాలంటున్న వైద్యులు ● ఏర్పాట్లు చేయాలని కోరుతున్న తల్లిదండ్రులు
హుజూరాబాద్: నీళ్లగంట.. ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేరళలో అమలవుతోన్న విధానాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్, ఇతర జిల్లాల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. రోజులో నాలుగుసార్లు వాటర్ బెల్ (నీళ్లగంట) మోగిస్తూ.. విద్యార్థులు పాఠశాలలో ఉన్న సమయాల్లో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగేలా కార్యాచరణ రూపొందించారు. కరీంనగర్ జిల్లాలోనూ ఈ విధానం అమలు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా.. ఎక్కడా కనిపించడం లేదు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సరిపడా నీళ్లు తాగకుంటే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆలోచన బాగు.. అమలు కష్టతరం
రెండేళ్లక్రితం కేరళలో వాటర్‌బెల్ కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు నీళ్లు తాగేలా ప్రణాళిక రచించారు. జిల్లాలోనూ గతేడాది పక్కాగా అమలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ కార్యక్ర మం అమలుకు నోచుకోవడం లేదు. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ఆర్వోప్లాంట్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు లేవు. విద్యార్థులు ఇంటినుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఒక్క బాటిల్ నీళ్లను రోజంతా తాగుతున్నారు. దీంతో వారి ఆరో గ్యంపై ప్రభావం చూపుతోంది. పీడీయాట్రిక్ యూ రోలిథియాసిస్ సమస్యతో బాధపడుతున్న బడిపిల్లల సంఖ్య కొన్నేళ్లుగా జిల్లాలో పెరుగుతోంది.
ఆరోగ్యంపై ప్రభావం..
ఉదయం పాఠశాల ప్రారంభం నుంచి ఒకదాని తర్వాత మరొక తరగతి వెనువెంటనే ఉంటాయి. ఇంటర్వెల్, మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో తప్ప నీళ్లు తాగేందుకు విద్యార్థులకు సమయం దొరకడం కష్టం. ఫలితంగా చదువు సంగతేమో గాని వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. బాల్యదశలో తీసుకోవాల్సిన రెండు నుంచి మూడు లీటర్ల నీటిని కూడా వారు తాగేందుకు సమయం దొరక్క చిన్నతనంలోనే మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా జిల్లా విద్యాశాఖ గతేడాది వాటర్‌బెల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత విద్యాసంవత్సరం పక్కాగా అమలు చేయగా.. ఈసారి ఎక్కడా కనిపించని పరిస్థితి.
రోజుకు
16 గ్లాసులు
వేసవికాలం మొదలైంది. ఎండలు ముదురుతున్నాయి. పాఠశాల విద్యార్థులపై ఎండల ప్రభావం ఉంటుంది. శరీరానికి సరిపడినంత నీరు అందకపోతే, చర్మ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో పాటు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు రోజుకు 16 గ్లాసులు నీరు తాగితే ఆరోగ్యంతో పాటు, ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. జిల్లాలో ఈ వేసవిలోనూ నీళ్లగంట కార్యక్రమం అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు.. విద్యార్థులు
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
ప్రాథమిక 424 11,900
ప్రాథమికోన్నత 76 2,900
ఉన్నత 149 24,400
నీళ్లగంట.. ఆరోగ్యమట!
Comments
Please login to add a commentAdd a comment