‘బదులు’ ఉద్యోగులపై బల్దియా కమిటీ
● వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలకసంస్థలోని పారిశుధ్య విభాగం ఔట్‌సోర్సింగ్ బదులు (ఒకరికి బదులు మరొకరు) ఉద్యోగుల వ్యవహారాన్ని తేల్చేందుకు నలుగురు అధికారులతో కమిటీ వేశారు. అనారోగ్యం, తదితర కారణాలతో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బదులుగా, వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు పనిచేస్తుండడం తెలిసిందే. దీనిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఇటీవల బదులు ఉద్యోగుల వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. బదులు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, అసలు ఉద్యోగులు పనిచేయకపోవడానికి కారణమేమిటంటూ ఒరిజినల్ ఉద్యోగులను పిలిపించి వారం రోజుల క్రితం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 67 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమకు బదులుగా తమ కుటుంబసభ్యులు ఉద్యోగాలు చేస్తారంటూ దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుల నేపథ్యంలో ఉద్యోగులు చెబుతున్న కారణాలు నిజమేనా కాదా అనేది తేల్చడానికి నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సోమవారం నలుగురు అధికారులతో కమిటీ వేశారు. అనంతరం కమిటీ సభ్యులు డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఏసీపీ బషీర్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, సంజీవ్‌తో ఆమె సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూడు కేటగిరీల వారిగా విభజించి వాస్తవ లెక్క తేల్చాలని సూచించారు. చనిపోయిన ఉద్యోగులు, 61 ఏళ్లు నిండినవారు, పూర్తిస్థాయిలో అనారోగ్యానికి గురైనవారిని మూడు కేటగిరీల వారిగా వివరాలు సేకరించాలన్నారు. ఇదిలా ఉంటే ఔట్‌సోర్సింగ్ బదులు ఉద్యోగులను తేల్చే పనితో పాటు, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో పనిచేస్తున్న బదులు ఉద్యోగుల వ్యవహారంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
క్వింటాల్ పత్తి రూ.7,050
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,050 పలికింది. సోమవారం మార్కెట్‌కు 15 వాహనాల్లో 158 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,700 వ్యాపారులు చెల్లించారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment