చర్యలు తప్పవా..?
● పన్ను డబ్బులు స్వాహా చేసిన బిల్‌కలెక్టర్లు ● నాలుగేళ్ల క్రితం బల్దియాలో ఘటన ● కొనసాగుతున్న శాఖాపరమైన విచారణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న ఆస్తి పన్ను వసూళ్ల స్వాహా పర్వం ఉద్యోగులు, అధికారులను వెంటాడుతోంది. సుమారు రూ.50 లక్షలకు పైగా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను సొంతానికి వాడుకున్న ఉదంతంపై తాజాగా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులైన ఇద్దరు బిల్ కలెక్టర్లు మరణించగా, మరో ఇద్దరు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఒక అధికారి రిటైర్డ్ కాగా, మరో అధికారి ప్రస్తుతం బల్దియాలోనే పనిచేస్తున్నారు. కాగా విచారణ పూర్తి కాగానే సదరు బాధ్యులపై చర్యలు తప్పవనే ప్రచారం ఉంది.
జరిగిందేమిటి..
2020–21 ఆర్థిక సంవత్సరంలో నలుగురు బిల్ కలెక్టర్లు తాము వసూలు చేసిన ఆస్తి పన్ను డబ్బును సొంతానికి వాడుకున్నారు. సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేసిన సొమ్మును నగరపాలకసంస్థలో జమ చేయకుండా, స్వాహా చేయడం సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి కమిషనర్ క్రాంతి నలుగురు బిల్ కలెక్టర్లతో పాటు, పర్యవేక్షణ లోపం కింద అప్పటి ఆర్‌వో రాములు, అకౌంటెంట్ ఖాదర్‌పై సీసీఏ రూల్స్ ప్రకారం చార్జెస్‌ఫ్రేమ్ (ఆరోపణల పట్టిక) చేశారు. డబ్బులు స్వాహా చేసినట్లు రుజువు కావడంతో సదరు బిల్ కలెక్టర్ల నుంచి రికవరీకి అధికారులు ఆదేశించారు. అయితే, నలుగురు బిల్ కలెక్టర్లలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు విధుల్లో ఉన్నారు. చనిపోయిన బిల్‌కలెక్టర్ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో, ఆమె జీతం నుంచి, చనిపోయిన మరో బిల్‌కలెక్టర్‌కు సంబంధించిన పెన్షన్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. విధుల్లో ఉన్న బిల్‌కలెక్టర్లు కూడా డబ్బులు తిరిగి చెల్లించారు.
శాఖాపరమైన విచారణ
సొంతానికి వాడుకున్న డబ్బులను రికవరీ చేసినప్పటికీ శాఖాపరమైన చర్యలకు బల్దియా సిద్ధమవుతోంది. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సు మన్, జమ్మికుంట కమిషనర్ ఆయాజ్ గత నెల 24న కరీంనగర్ బల్దియాలో కార్యాలయంలో వి చారణ చేపట్టారు. అయితే అప్పటి ఆర్‌వో రాములు గుండ్ల పోచంపల్లి కమిషనర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అకౌంటెంట్ ఖాదర్ ప్రస్తుతం నగరపాలకసంస్థలో డిప్యూటీ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వీరిరువురి నుంచి కూడా విచారణ అధికారులు అప్పటి సమాచారాన్ని సేకరించారు. కాగా నాలుగేళ్ల తర్వాత విచారణ మళ్లీ కొనసాగడం, శాఖాపరమైన చర్యలుంటాయనే సంకేతాలు బల్దియాలో కలకలం సృష్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment