ముగ్గురు ఏజెంట్ల అరెస్టు
ఖలీల్‌వాడి(నిజామాబాద్): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిజామాబాద్ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్, లావోస్ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. వీరిని లావోస్ దేశంలో బంధించి సైబర్ నేరాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిని సారంగాపూర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
జగిత్యాల క్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద.. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ట్రాలీఆటోను మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన కడారి గంగాధర్ (55), అతని బంధువు శ్రీహరి అలియాస్ శ్రీనివాస్‌తో కలిసి ట్రాలీ ఆటోలో టీఆర్‌నగర్ వెళ్తున్నారు. కరీంనగర్ నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ట్రాలీఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై సధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment