రెండు బైక్‌లు ఢీకొని ఒకరి దుర్మరణం
ధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తీగలధర్మారంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన అప్పాల మల్లయ్య (56) దొంతాపూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరుగు పయనం అయ్యాడు. దోనూర్, తీగలధర్మారం మధ్య ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో మల్లయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న దోనూర్ గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కాగా అతడిని 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించినట్లు బంధువుల ద్వారా తెల్సింది. మల్లయ్యకు భార్య, కొడుకు మహేష్, కూతురు లత ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మల్లయ్య స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment