● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో బదులు కార్మికుల విచారణ పూర్తి చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల వ్యవహారంపై శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫోర్‌మెన్ కమిటీ విచారణ చేపట్టింది. గతంలో నోటీసులు జారీ చేసిన, అర్జీలు సమర్పించిన కార్మికులు కమిటీ ఎదుట హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజయ్‌కుమార్, ఏసీపీ బషీరొద్దీన్‌లతో కూడిన ఫోర్‌మెన్ కమిటీ ఆధ్వ ర్యంలో విచారణ చేపట్టారు. అసలు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, బదులు కార్మికులను విచారించారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, మున్సిపల్ నిబంధనలకు లోబడి త్వరలో బదులు కార్మికులపై నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ వివరించారు.
పూర్తిస్థాయిలో కమాండ్ కంట్రోల్ సేవలు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా నగర ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ తెలిపా రు. నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గోలైవ్‌ను ప్రారంభించారు. ఐసీసీ ద్వారా నగరవ్యాప్తంగా 24 జంక్షన్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల్లో 335 సర్వలెన్స్ కెమెరాలు, 350 ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం కెమెరాలు, 10 ఎన్విరాన్మెంటల్ సెన్సార్‌లు, 10 వీఎండిలు అమర్చినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ ప్రతినిధి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై కల్పించిన 25 శాతం రాయితీని వినియోగించుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ కోరారు. రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించే గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్నందున, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.