రైల్వే హైట్‌గేజ్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వే హైట్‌గేజ్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌

Published Sat, Mar 29 2025 12:08 AM | Last Updated on Sat, Mar 29 2025 12:08 AM

రైల్వే హైట్‌గేజ్‌ను  ఢీకొట్టిన ట్యాంకర్‌

రైల్వే హైట్‌గేజ్‌ను ఢీకొట్టిన ట్యాంకర్‌

● నిలిచిన వాహనాల రాకపోకలు

కరీంనగర్‌రూరల్‌: తీగలగుట్టపల్లి రైల్వేగేట్‌ వద్ద పైన ఉన్న హైట్‌గేజ్‌కు చొప్పదండి నుంచి కరీంనగర్‌కు వస్తున్న రెడ్‌మిక్స్‌ ట్యాంకర్‌ తాకడంతో ఐరన్‌పోల్‌ విరిగిపోయింది. ఈ ఘటన ఉద యం 8 గంటలకు జరగగా.. వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఐరన్‌పోల్‌ విరిగి రోడ్డుపై వేలాడుతుండటంతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే క్రేన్‌సాయంతో మరమ్మతు చేసి అరగంట అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎలక్ట్రికల్‌ ట్రైన్లు నడిచేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌లైన్‌ రక్షణ కోసం హైట్‌గేజ్‌ ఏర్పాటు చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ అవగాహన లేకుండా వేగంగా నడపడటంతో హైట్‌గేజ్‌ పోల్‌ విరిగిందని వివరించారు.

ఒడిశా కార్మికుల తరలింపు

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను శుక్రవారం జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక బస్సుల్లో వారి రాష్ట్రానికి తరలించారు. సర్వేనంబర్‌ 437, 251లో కొంతమంది అక్రమ పట్టాలు పొంది భూమిని ఇటుకబట్టీల వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. అధికారులు ఆ పట్టాలు రద్దు చేసి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంత భూమిలో ఇటుక బట్టీలతో పాటు కార్మికుల నివాసాలు ఉండటంతో శుక్రవారం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 93మంది కార్మికులను బస్సుల్లో తరలించారు.

రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

పెద్దపల్లిరూరల్‌: పట్టణానికి చెందిన ఎండీ అహమద్‌ (51) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని బసంత్‌నగర్‌ ఎస్సై స్వామి తెలిపారు. అహమద్‌ ఈనెల 26న తన స్నేహితుడు శ్రీనివాస్‌తో బైక్‌పై విధులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. అహమద్‌ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య జులేకబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

బాలికను వేధించిన యువకుడికి రెండేళ్ల జైలు

జగిత్యాలజోన్‌: మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట బడి వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి జి.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను అదే గ్రామానికి చెందిన ఎండీ అంకూస్‌ ప్రేమిస్తున్నాంటూ వెంటపడ్డాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బాలికను మానసికంగా వేధించాడు. దీంతో సదరు బాలిక కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో 2019లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసుకుని, నిందితుడు అంకూస్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు కోర్టులో బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడైన అంకూస్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement