
ప్రకృతి వైపరీత్యాలపై జాగ్రత్తగా ఉండాలి
● టీజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ అశోక్
కొత్తపల్లి(కరీంనగర్): ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని టీఎజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) బి.అశోక్ సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో బుధవారం డీఈలు, ఏడీఈలు, ఏఈలతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. అధికారులు వారి హెడ్‌క్వార్టర్లలో ఉంటూ విద్యుత్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాలి దుమారాలతో లైన్లు తెగడం, విద్యుత్ స్తంభాలు విరగడం వంటివి జరిగినప్పుడు తక్షణమే స్పందిస్తూ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ఇంటర్ లింకింగ్ లైన్లను త్వరితగతిన పూర్తిచేయాలని, పవర్ ఇంట్రాక్షన్ వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్, పిడుగుపాటుతో కాలిపోవడం వంటి వాటిపట్ల అప్రమత్తండా ఉండాలన్నారు. సమావేశంలో కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, పి.చంద్రమౌళి, కాళీదాసు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే కఠినచర్యలు
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు. సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కొందరు ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే సామాజిక మాధ్యమాల్లో తప్పు ప్రచారం చేస్తే సదరు అకౌంట్ హోల్డ ర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన సన్నబియ్యంతో కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతన్నందున గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని డీమార్ట్, వరలక్ష్మీగార్డెన్, తులసీనగర్, హెచ్‌పీ గ్యాస్ గోదాం, రెడ్డి ఫంక్షన్‌హాల్ ప్రాంతాలు, ఏబీ స్విచ్‌లు బిగిస్తున్నందున ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ కిసాన్‌నగర్ ఫీడర్ పరిధిలోని కిసాన్‌నగర్ ప్రవిష్ట, అర్బన్ హెల్త్ సెంటర్, ఖాన్‌పుర, హుస్సేనిపుర, దుర్గమ్మగడ్డ, రజ్వీచమన్, బొమ్మకల్ బైసాప్, సిటిజన్‌కాలనీ, విజయలక్ష్మీకాలనీ, శ్రీపురం కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు.
కమాన్‌పూర్‌లో..
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన వర్సిటీ సబ్‌స్టేషన్ కమాన్‌పూర్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు.