
68 దుకాణాలు.. 415 దరఖాస్తులు
● రేషన్ డీలర్ పోస్టుకు డిమాండ్ ● రంగంలోకి రాజకీయ నాయకులు ● రూ.లక్షల్లో బేరసారాలు ● తాజాగా మరో 26 పోస్టులకు ప్రకటన
కరీంనగర్ అర్బన్: జిల్లాలో రేషన్ దుకాణాల నిర్వహణకు పోటీ నెలకొంది. దశాబ్దాల తరువాత రేషన్ డీలర్ల నియామకానికి ప్రకటన వెలు వడటంతో వందల్లో దరఖాస్తులు వచ్చాయి. గత నెల 29న కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 68 రేషన్ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 12వరకు స్వీకరించగా.. 415మంది దరఖాస్తు చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో 7, గంగాధర 6, మానకొండూరు 9, చొప్పదండి 8, రామడుగు 6, తిమ్మాపూర్ 8, చిగురుమామిడి 5 గన్నేరువరం 7, కొత్తపల్లి 2, కరీంనగర్ అర్బన్ మండలంలో 10 రేషన్ దుకాణాలు ఖాళీలుండగా రోస్టర్ పాయింట్ ప్రకారం రిజర్వేషన్లను కేటాయించారు. ఒక దుకాణానికి ఆరుగురు పోటీపడుతున్నారు.
బేరసారాలు షురూ
రేషన్ డీలరు పోస్టుకు పోటీ నెలకొనడంతో పలు ప్రాంతాల్లో బేరసారాలు జోరందుకున్నాయి. రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో ఆశావహులు కంగుతింటున్నా రు. కరీంనగర్ రూరల్, గంగాధర, కరీంనగర్ అర్బన్, తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరువరం మండలాల్లోని పలు ఖాళీలకు ఇప్పటికే ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినవారికే అవకాశమని ఆర్డీవో స్పష్టం చేస్తుండగా క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి. రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే రంగంలో దిగగా తమ పలుకుబడితో డీలర్‌షిప్ ఇప్పిస్తామని, అవసరమైతే ప్రభుత్వ పెద్దలతో చెప్పిస్తామంంటున్నారని పలువురు అర్జీదారులు ‘సాక్షి’కి వివరించారు. రేషన్ దుకాణాన్ని బట్టి గతంలో ఉన్న రిజర్వేషన్ల క్రమంలో పలు దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది.
మరో 26 దుకాణాలకు ప్రకటన
కోర్టు కేసుల్లో ఉన్న మరో 26 డీలర్ల ఖాళీలకు ఆర్డీ వో మహేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. నాగిరెడ్డిపూర్ (బీసీ–బీ), గోపాల్‌రావుపల్లి (బీసీ–ఏ), పెద్దకుర్మపల్లి (ఓసీ–మహిళ), పోచంపల్లి (ఎస్సీ), నగునూరు (ఓసీ), ఎలబోతారం (బీసీ బీ), తిర్మలాపూర్ (ఎస్టీ మహిళ), గుండి (ఈడబ్ల్యూఎస్), దేశ్‌రాజ్‌పల్లి(ఎస్సీ), గోపాల్‌రావుపేట (ఓసీ–మహిళ), ఖాజీపూర్ (బీసీ–ఏ), రేకుర్తి (ఓసీ), (బీసీ–బీ మహిళ), (బీసీ–డీ), కొత్తపల్లి (ఎంఆర్), (ఎస్టీ), (ఓసీ–మహిళ), (బీసీ ఈ), మల్కాపూర్ (బీసీ–బీ), చింతకుంట (ఈడబ్ల్యూఎస్), (ఎస్సీ–మహిళ), (ఓసీ), సీతారాంపూర్(ఓసీ–మహిళ), తమిళకాలనీ(ఎస్సీ), ఆసిఫ్‌నగర్ (బీసీ–డీ), నాగుల మల్యాల(ఎస్టీ)కు కేటాయించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, చౌక ధరల దుకాణ పరిధిలో నివాసముండాలి. 18–40 ఏళ్లలోపువారు అర్హులు కాగా మే 15న పరీక్ష, 28న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఆర్డీవో వెల్లడించారు. ఎలాంటి పైరవీలకు అస్కారం లేదని, పారదర్శకంగా నియామక ప్రక్రియ ఉంటుందని వివరించారు.