
రైతు సంక్షేమానికే ‘భూభారతి’
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌స్పోర్ట్స్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, కొత్తపల్లిలోని రైతువేదికల్లో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. భూభారతితో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్‌తో రైతులు తమ భూ సమస్య దేని పరిధిలోకి వస్తుందో తెలి యక కోర్టులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారన్నారు. నూతన చట్టంలో మాత్రం రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. ఆధార్ మాదిరి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ కమతానికి భూధార్ సంఖ్య కేటాయించినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అందరి దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా వ్యవహరిస్తుందని సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఈఓ పవన్‌కుమార్, తహసీల్దార్లు రాజు, రాజేశ్, ఏడీఏ రణదీర్‌రెడ్డి, ఏవో కృష్ణ, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
భవిత సెంటర్లను తీర్చిదిద్దండి
భవిత సెంటర్లను ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్‌లోని ముకరాంపురంలో ఉన్న భవిత సెంటర్‌ను శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించారు. జిల్లాలో 16 భవిత సెంటర్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ప్రతీ సెంటర్ గ్రాండ్ లుక్ ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా భవిత సెంటర్లు దోహదపడాలని అన్నారు. అనంతరం రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్కూల్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న పెన్సింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, స్కూల్లో క్రీడాకారులను ఆకట్టుకునేలా మొక్కలు నాటాలని, ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మొక్కలు నాటించాలని సూచించారు. జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, పీఆర్‌డీఈ జనార్దన్ పాల్గొన్నారు.
చట్టంతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం
సర్వే, విచారణ అనంతరమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు
గ్రామాల వారీగా రికార్డుల నిర్వహణ
అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పమేలా సత్పతి