బనశంకరి: వాయువేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు మడివాళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కంటి వెలుగులు అవుతారనుకున్న కుటుంబాల ఆశలు చిదిమిపోయాయి.
ఒకే హాస్టల్లో స్నేహితులు
వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ చెందిన కార్తీక్ (23), బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ కోరమంగలలో సాఫ్ట్‌వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భగీరథరెడ్డి (17) బెంగళూరులో ఒక ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతూ అదే ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉండేది.
డివైడర్‌ను ఢీకొని మళ్లీ బస్సును
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్ తన కారులో భగీరథరెడ్డి కలిసి బయలుదేరారు. కారులో వేగంగా వెళ్తూ సిల్క్‌బోర్డు సమీపంలో రోడ్డు డివైడరును అదుపుతప్పి ఢీకొని దూసుకెళ్లి అవత ల లేన్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అంతలోగా ఇద్దరు మృతిచెందారు. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మడివాళ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment