సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో సోమవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సైదాపుర పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడంతస్తుల భవంతిలో మంటలు వ్యాపించి, అందులోనే వస్త్ర వ్యాపారం చేసుకుంటూ, నివాసం ఉంటున్న రాఘవేంద్ర అలియాస్ రాగయ్య(39), శిల్పా(35) దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
రెండు అంతస్తుల్లో బట్టలు షాపులు పెట్టుకుని, పై అంతస్తులో నివాసం ఉండేవారు. ఆదివారం రాత్రి రోజూమాదిరిగా వ్యాపారం ముగిసిన తర్వాత నిద్రించారు. చిన్నారులు, తల్లిదండ్రులు కింద అంతస్తులో, భార్యాభర్తలు పైఅంతస్తులో నిద్రపోయారు. మరో రెండు గంటల్లో తెల్లవారుతుండగా కింది అంతస్తులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. రాగయ్య, శిల్పలు మేలుకుని కిందకు వచ్చేందుకు అవకాశం లేదని పై అంతస్తులోనే బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నారు. అయితే మంటలు, పొగ వ్యాపించడంతో ఊపిరి ఆడక మృతి చెందారని సీఐ కాళప్ప తెలిపారు.
క్షేమంగా బయటపడ్డ పిల్లలు
కింద అంతస్తులో నిద్రిస్తున్న మృతుల కుమారులు రిషబ్(11), వేదాంశ్(7)లతో పాటు తల్లిదండ్రులు బయటకు పరుగులు తీసి మంటలు ఆర్పేందుకు సహాయం కోరారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు శ్రమించారు. సైదాపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల విలువైన దుస్తులు కాలిపోయాయి. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment