
ఘోర రైలు ప్రమాదంలో కన్నడిగులు ఎవరూ చిక్కుకోలేదని మంత్రి సంతోష్‌లాడ్ ఫోన్ ద్వారా సీఎం సిద్దరామయ్యకు సమాచారం అందించారు.
బనశంకరి: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కన్నడిగులు ఎవరూ చిక్కుకోలేదని మంత్రి సంతోష్‌లాడ్ ఫోన్ ద్వారా సీఎం సిద్దరామయ్యకు సమాచారం అందించారు. బహనాగకు వెళ్లిన మంత్రి అక్కడ కన్నడిగుల కోసం ఆరా తీశారు. కన్నడిగులు ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదని సంతోష్‌లాడ్ తెలిపారు. ప్రయాణ వసతి లేక చిక్కుకున్న సుమారు 80 మంది కన్నడిగులను రాష్ట్రానికి రెండు విమానాల ద్వారా ఆదివారం ఉదయం బెంగళూరుకు తరలించారు. 18 మందిని మైసూరుకు పంపారు. మిగిలిన వారు హాసన్, చిక్కమగళూరుకు వెళ్లారు.
హోటల్ కార్మికుడు మృతి
యశవంతపుర నుంచి కోల్‌కతాకు బయలుదేరిన హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ప్రయాణికుల్లో బెంగళూరు నుంచి వెళ్తున్న సుమారు 30 మందికి పైగా గాయపడగా వీరిలో ఒకరు మరణించారు. వీరిలో కన్నడిగులు ఎవరూ లేరు. పశ్చిమబెంగాల్ కు చెందిన సాగర్ ఖేరియా (30) మరణించాడు, అతడు బెంగళూరులో హోటల్ కార్మికునిగా పనిచేసేవాడు. సొంతూరికి వెళ్దామని బయల్దేరి ప్రమాదానికి గురయ్యాడు.
రైలు సర్వీసులు మళ్లీ ప్రారంభం
రైలు ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలు నిలిపివేసిన రైల్వేశాఖ మళ్లీ రైలు సంచారానికి అనుమతించింది. బెంగళూరు బయప్పనహళ్లి ఎస్‌వీఎంటీ రైల్వేస్టేషన్ నుంచి మూడు రైళ్లు బయలుదేరాయి. రైలు నంబరు 22305 ఎస్‌వీఎంటీ రైల్వేస్టేషన్ నుంచి జేఎస్‌ఎంఈ జార్ఖండ్‌కు ఆదివారం మధ్యాహ్నం 12.30కు బయలుదేరింది. నంబరు 12864 రైలు బైయప్పనహళ్లి ఎస్‌వీఎంటీ నుంచి హౌరాకు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది.